పార్టీ మారుతున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన 'గంటా శ్రీనివాస్'

By Newsmeter.Network  Published on  5 Dec 2019 11:21 AM GMT
పార్టీ మారుతున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన గంటా శ్రీనివాస్

ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ పార్టీ వీడుతున్నట్లు వార్తలు చాలా రోజుల నుంచి వైరల్‌ అవుతున్నాయి. టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు పుకార్లు షికార్లు అయ్యాయి. అలాగే వైసీపీలో చేరేందుకు ఆయా మంతనాలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఈ రోజు ఖండించారు. నా రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మీడియా సృష్టేనని స్పష్టం చేశారు. కాగా, గంటా శ్రీనివాస్‌ రావు వైసీపీలో వచ్చేందుకు జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నం మానుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా మళ్లీ బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు, ఇప్పటికే ఆయన జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి బీజేసీ నేతలతో మంతనాలు కూడా జరిపారని ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికల ముందు... ఆ తర్వాత పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతూనే ఉందని గంటా అన్నారు. అవన్ని లేనిపోనివి సృష్టిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. కాగా, తాను నరేంద్రమోదీతో కలిసి తీసుకున్న ఫోటో నిజమేనని, అది మోదీ గుజరత్ ముఖ్యమంత్రిగా ఉండగా, తాను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పటి ఫోటో అని, ఆ ఫోటోను పట్టుకుని ఇప్పుడు వైరల్ చేశారన్నారు. తాను ఏదైన నిర్ణయం తీసుకుంటే ముందు మీడియాకే చెబుతానని స్పష్టం చేశారు. పంక్షన్లలో, ఇతర పార్టీలలో వ్యక్తులను కలుస్తుంటానని, అలా అని రాజకీయాలతో ముడిపెట్టలేమని అన్నారు. తాజాగా 'గంటా' చేసిన ప్రకటనతో ఆయన టీడీపీలోనే కొనసాగుతారన్న స్పష్టత కనిపిస్తోంది.

Next Story