Andhra Pradesh: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయ ఢంకా మోగించింది.
By అంజి Published on 16 March 2023 9:43 AM GMTనర్తు రామారావు, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ (ఫైల్ ఫోటోలు)
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయ ఢంకా మోగించింది. తగిన సంఖ్యాబలం లేకపోయిన బరిలో నిలిచిన టీడీపీ.. ముందుగా ఊహించినట్లే ఒక్క స్థానాన్ని కూడా గెల్చుకోలేదు. కర్నూలు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలను అధికార వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. దీంతో వైఎస్సార్‌సీపీ ఖాతాలో మరో విజయం చేరింది.
శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఆనెపు రామకృష్ణ (108 ఓట్లు)పై వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి నర్తు రామారావు 632 ఓట్ల తేడాతో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు వచ్చాయి.
పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవురు శ్రీనివాస్ కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్ కు 460 ఓట్లు వచ్చాయి. మొత్తం 1105 ఓట్లు ఉండగా 1088 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. వైసీపీకి చెందిన కవురు శ్రీనివాస్‌కు 481 మొదటి ప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. వంకా రవీంద్రనరాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు వచ్చాయి.
అటూ కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. 988 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన 5 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు.