తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించి మూడో ఏడాది సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 2,48,468 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఆటో డ్రైవర్లు తమ కష్టాలను తన దృష్టికి తీసుకొచ్చారని, తాము కష్టపడి ఆటో నడుపుతున్నామని, కానీ వచ్చిన డబ్బులు ఆటో రిపేర్లు, రోడ్డు టాక్సీలు, పోలీసులు విధించే ఫైన్లకే సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. వారి ఆవేదనను అర్ధం చేసుకొని 2018 ఏలూరు సభలో ఇచ్చిన మాట ప్రకారం వాహన మిత్ర పథకాన్ని తీసుకొచ్చామన్నారు.
వాహన మిత్ర పథకంలో 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలే లబ్ధిపొందుతున్నారని సీఎం అన్నారు. ఈ పథకం ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలచొప్పున సాయం అందజేస్తున్నామన్నారు. 2,48,468 మంది లబ్ధిదారులకు రూ.248.47కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు రూ.759 కోట్ల సాయం విడుదల చేశామన్నారు. ఇక లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందన్నారు. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవడానికి మరో నెలరోజులు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.