రవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన 'వైఎస్సార్ వాహన మిత్ర' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా అందించింది. ఇందులో భాగంగా సీఎం జగన్ విశాఖ నుంచి వైఎస్సార్ వాహన మిత్ర నిధులు విడుదల చేశారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను సీఎం వైఎస్ జగన్ బటన్‌నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. 2,61,516 లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. దీంతో ఈ నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం 'వైఎస్సార్ వాహన మిత్ర' పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేసింది.
వాహన మిత్రతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ''ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదు. కులం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.'' అని సీఎం జగన్ తెలిపారు. 'చూశాను.. విన్నాను.. ఉన్నాను' అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వాహనమిత్ర పథకం ప్రారంభించామని సీఎం జగన్ అన్నారు. కోవిడ్ టైమ్‌లోనూ వాహన మిత్ర పథకం అమలు చేశామన్నారు. మనది పేదల ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని సీఎం అన్నారు.