రైతుల‌కు శుభ‌వార్త‌.. పంట‌ల బీమా నిధులు విడుద‌ల

YSR Uchitha Pantala Bheema Scheme funds release. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్‌-2020 సీజన్‌కు సంబంధించిన‌ నిధులను విడుద‌ల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 May 2021 12:50 PM IST
YSR Uchitha Pantala Bheema Scheme

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు శుభ‌వార్త చెప్పింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుండ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన్నారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్‌-2020 సీజన్‌కు సంబంధించిన‌ నిధులను మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్లు, ల‌బ్ధిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆయ‌న మాట్లాడారు.

ఖరీఫ్‌-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసిన‌ట్లు చెప్పారు. రైతుల‌ను ఆదుకునేందుకే ఉచిత పంట‌ల బీమా నిధులు విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో 60 శాతానికిపైగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని.. రైతుల‌పై ఆర్థిక భారం లేకుండా ప్ర‌భుత్వ‌మే బీమా మొత్తాన్ని భ‌రిస్తోంద‌న్నారు. రైతు భ‌రోసా కింద ఈ నెల‌లోనే రూ.3, 990 కోట్లు అందించామ‌న్నారు. రైతులు, రైతు కూలీలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నారు. గతేడాది ఖరీఫ్‌లో 15.15 లక్షల మంది రైతులకు పంట నష్టం జరిగిందని.. పంట నష్టపోయిన రైతులందరికీ రూ.1,820.23 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు.

గత ప్రభుత్వాలు ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీలను నిర్లక్ష్యం చేశాయన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేదని.. తాము అధికారంలోకి వచ్చాక ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తున్నామని వెల్ల‌డించారు.


Next Story