YSR Asara Scheme: రేపే వైఎస్‌ఆర్ ఆసరా నిధుల విడుదల.. ఏలూరు జిల్లాకు సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, మార్చి 25న ఏలూరు జిల్లాలోని దెందలూరులో పర్యటించనున్నారు.
By అంజి
YSR Asara Scheme: రేపు ఏలూరు జిల్లాకు సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, మార్చి 25న ఏలూరు జిల్లాలోని దెందలూరులో పర్యటించనున్నారు. స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జి) సహాయం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆసరా పథకం మొత్తాన్ని విడుదల చేయనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి దెందులూరు చేరుకుని మధ్యాహ్నం 10.50 నుంచి 12.35 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 1.35 గంటలకి దెందులూరు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఇప్పటికే సీఎం వైఎస్ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, పలు శాఖల అధికారులు పరిశీలించారు.
రాష్ట్రంలోని 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళ ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని సీఎం జగన్ జమ చేయనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పును ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉండగా.. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. రేపు జమ చేయనున్న మొత్తం కలిపితే మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లను సర్కారు పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసినట్లు కానుంది. ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా వాడుకోవచ్చని సీఎం జగన్ ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది.