వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు
YS Viveka Murder case : Kadapa MP Avinash Reddy Gets CBI Notices.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో
By తోట వంశీ కుమార్ Published on 24 Jan 2023 9:58 AM ISTమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సోమవారం నోటీసులు జారీ చేసింది. నేడు(మంగళవారం) హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏకు అధికారులు ఈ నోటీసు ఇచ్చారు.
కాగా.. నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అయితే.. నేటీ విచారణకు హాజరుకాలేనని అన్నారు. ఒక రోజు ముందుగా నోటీసు ఇవ్వడంతో విచారణకు హాజరుకాలేనని, ముందస్తు కార్యక్రమాలు ఉండడమే అందుకు కారణంగా చెప్పారు. 5 రోజుల తరువాత ఎప్పుడు పిలిచినా వస్తానని సీబీఐకి ఎంపీ సమాచారం అందించారు. విచారణకు మరో తేదీని తెలపాలని లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పటి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది. పలువురిని అరెస్ట్ చేసింది. కొన్ని పరిణాల తరువాత కేసు ఏపీ హైకోర్టుకు చేరింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు విచారణకు అప్పగించింది న్యాయస్థానం.
కొద్ది రోజుల తరువాత ఈ కేసు విచారణ వేగవంతంగా సాగడం లేదని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వైఎస్ వివేకా కూతురు సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించగా తెలంగాణకు బదిలీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయిన తరువాత మళ్లీ విచారణ మొదలుపెట్టిన సీబీఐ ఎంపీ అవినాష్‌కు నోటీసులు ఇచ్చింది.