ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు తీసుకున్న షర్మిల, వైసీపీ, టీడీపీలపై విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు.

By Srikanth Gundamalla  Published on  21 Jan 2024 10:15 AM GMT
ys sharmila,  andhra pradesh, congress,

ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు తీసుకున్న షర్మిల, వైసీపీ, టీడీపీలపై విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడలో వైఎస్ షర్మిల పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీలోకి తాను రావాలని కేడర్ కోరుకుందనీ.. అందుకు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత గత పదేళ్లలో ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ వైసీపీ, టీడీపీలపై విమర్శణాస్త్రాలు ఎక్కుపెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయే నాటికి అప్పు రూ.లక్ష కోట్లు ఉండేదని చెప్పారు షర్మిల. అయితే.. ఆ తర్వాత చంద్రబాబు రూ.2లక్షల కోట్ల అప్పు చేస్తే.. ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్‌ రూ.3లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. అన్ని బకాయిలు కలిపితే రాష్ట్రంపై రూ.10లక్షల కోట్ల భారం ఉందని అన్నారు. ఇంత అప్పు చేసినా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. ఇక రాష్ట్రానికి ఇప్పటి వరకు రాజధాని లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. విజయవాడలో కనీసం ఒక మెట్రో కూడా వేయించలేకపోయారని షర్మిల విమర్శలు చేశారు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా నిధులు లేని దుస్థితి తీసుకొచ్చారంటూ పాలకులపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక మాఫియా దోచుకోవడం.. దాచుకోవడం జరుగుతున్నాయని అన్నారు. ఇటు చంద్రబాబు, అటు జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయనీ.. తద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ప్రత్యేక హోదాను సాధించడంలో పాలకులు విఫలమయ్యారని చెప్పారు. హోదా కోసం చంద్రబాబు ఏనాడూ ఉద్యమం చేయలేదని అన్నారు. పైగా ఉద్యమం చేసేవారిని జైలులో పెట్టారని ఆరోపించారు. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరాహారదీక్షలు చేశారు.. కానీ ప్రభుత్వంలోకి వచ్చాక దాని ఊసే ఎత్తలేదని అన్నారు. స్వలాభం కోసమే జగన్, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తామని బీజేపీ చెప్పిందనీ.. ఆ హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు కేంద్రంలోని బీజేపీ చేతుల్లో కీలు బొమ్మలు అయ్యారని ఆరోపించారు.

Next Story