తెనాలికి చెందిన గీతాంజలి మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గీతాంజలి మరణంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించకపోవడంపై నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. స్త్రీ నాయకత్వానికి మొదటి ప్రధాన లక్షణం స్త్రీలు, పిల్లల పట్ల కనికరంగా ఉండటమని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేసిన గీతాంజలి ఘటనపై షర్మిల మౌనంగా ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని పూనమ్ కౌర్ అన్నారు. తెనాలిలో సామాన్య మహిళలు, బాలికలు బయటకొచ్చి వారికి పాఠం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అంతకుముందు పూనమ్ కౌర్ చేసిన ట్వీట్‌లో..‘గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలికి ఎందుకు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చింది? ఒక పార్టికి చెందిన సోషల్ మీడియా ట్రోలర్స్ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందా? అమ్మాయిల మీద ఇలా లేని పోని పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం కొందరికి బాగా అలవాటైపోయింది. దయచేసి వారిని కఠినంగా శిక్షించండి. ఆ పసి పిల్లలు (గీతాంజలి బిడ్డలు)కు న్యాయం చేయండి’ అని డిమాండ్ చేసింది.