'చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసిన అన్నగా జగన్‌ నిలిచిపోతారు'.. కన్నీరు పెట్టుకున్న వైఎస్‌ షర్మిల

తాను అడిగిన ప్రశ్నలకు సీఎం వైఎస్‌ జగన్‌ సూటిగా సమాధానం చెప్పాలని కడప ఎంపీ అభ్యర్థి షర్మిల డిమాండ్‌ చేశారు. కడపలో వైఎస్‌ షర్మిల మాట్లాడారు.

By అంజి  Published on  10 May 2024 6:00 PM IST
YS Sharmila ,  Kadapa, CM Jagan, YCP, APPolls

'చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసిన అన్నగా జగన్‌ నిలిచిపోతారు'.. కన్నీరు పెట్టుకున్న వైఎస్‌ షర్మిల

తాను అడిగిన ప్రశ్నలకు సీఎం వైఎస్‌ జగన్‌ సూటిగా సమాధానం చెప్పాలని కడప ఎంపీ అభ్యర్థి షర్మిల డిమాండ్‌ చేశారు. కడపలో వైఎస్‌ షర్మిల మాట్లాడారు. రాజన్న బిడ్డనన్న ఇంగితం లేకుండా తనపై, తన పుట్టుకపై రాక్షస సైన్యంతో జగన్‌ ప్రచారం చేయిస్తున్నారని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. 'చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసిన అన్నగా జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు. మీ కోసం త్యాగం చేసిన చెల్లిని గౌరవించకపోగా.. మానసికంగా హింసిస్తారా? ఈ ఐదేళ్లలో మీతో ఒక్క పైసా పని చేయించుకున్నానా? ప్రపంచంలో రాజకీయ విభేదాలు ఉన్నావారు చాలా మంది ఒకే కుటుంబంలో లేరా?' అని షర్మిల ప్రశ్నించారు. మీరు వైఎస్‌ఆర్‌ కొడుకునని ఎందుకు మర్చిపోతున్నారు? అని అడిగారు.

తనకు రాజీక, డబ్బు కాంక్ష లేదని వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. ఆ కాంక్షే ఉంటే జగన్‌ జైలులో ఉన్నప్పుడే వైసీపీని హైజాక్‌ చేసే దాన్ని అని జగన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. 'నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది మీరేగా? జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేయమనలేదా? నా భర్త, పిల్లలను వదిలి వేల కిలోమీటర్లు నడిచా. అప్పుడు మీ పార్టీ అంతా నా చుట్టూనే తిరిగింది. సోషల్‌ మీడియాలో నాపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు' అని షర్మిల కన్నీళ్లు పెట్టుకున్నారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చిపట్టుకుందన్న షర్మిల.. అందుకే భ్రమల్లో బతుకుతున్నారని అన్నారు. జగన్‌ మానసిక పరిస్థితిపై తనకు నిజంగానే ఆందోళనగా ఉందన్నారు. మాట మాట్లాడితే తాను, సునీత చంద్రబాబు చేతిలో రిమోట్‌ కంట్రోల్‌ అని, ఆయన చెప్పినట్లు చేస్తున్నామని అంటున్నారని షర్మిల మండిపడ్డారు.

''మీరు సీఎం అయ్యేంత వరకు అన్న కోసమని, రాజశేఖర్‌ రెడ్డి చేసిన సంక్షేమ పాలన మీరు మళ్లీ తీసుకొస్తారని నమ్మి నేను మీకోసం ఎంతో చేసిన విషయం వాస్తవం కాదా? మనిద్దరం నమ్మే బైబిల్‌ మీద ఒట్టేసి నేను చెప్పగలను.. నాకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్షగానీ, మిమ్మల్ని పదవి అడగకుండా మీ కోసం నిస్వార్థంగా పనిచేశానని నేను ప్రమాణం చేయగలను. మిమ్మల్ని పదవి అడిగానని మీరు అదే బైబిల్‌పై ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉందని, డబ్బు కాంక్ష ఉందని గానీ రుజువు చేయగలరా? అసలు మనిషిని, మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్‌ రెడ్డి నుంచి మీకు ఎందుకు రాలేదు?'' అని సీఎం జగన్‌ను ప్రశ్నిస్తూ షర్మిల కన్నీరు పెట్టుకున్నారు.

Next Story