'హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు'.. వైఎస్ షర్మిల ఆన్‌ఫైర్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. జగనన్న ఓడించాలని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
By అంజి Published on 5 April 2024 1:45 PM IST'హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు'.. వైఎస్ షర్మిల ఆన్‌ఫైర్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. జగనన్న ఓడించాలని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. జగనన్న ఓటమితో హత్యా రాజకీయాలకు స్వస్తి పలకొచ్చన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి సీటును జగన్ వాడుకుంటున్నారని షర్మిల విమర్శించారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే తాను కపడ నుంచి ఎంపీ అభ్యర్థిగా చేస్తున్నానని తెలిపారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ ఐదేళ్లు సీఎంగా ఉన్నారని.. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత స్కీమ్‌లను తీసుకొచ్చారని అన్నారు.
రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారని అన్నారు. స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక బీజేపీకి స్పెషల్ స్టేటస్‌ను తాకట్టు పెట్టారని షర్మిల ఫైర్ అయ్యారు. స్పెషల్ స్టేటస్ వచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవని, రాష్ట్రం అభివృద్ధి చెందేదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు.. పోలవరం పూర్తికాలేదు.. ఎలాంటి అభివృద్ధీ జరగలేదని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. ధర్మం కోసం ఒకవైపు నేను.. మరోవైపు డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి. ఎవర్ని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించాలని షర్మిల అన్నారు.