ఆ డీల్ ర‌ద్దు చేయండి.. చంద్రబాబుకు షర్మిల లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు.

By Medi Samrat  Published on  25 Nov 2024 1:45 PM GMT
ఆ డీల్ ర‌ద్దు చేయండి.. చంద్రబాబుకు షర్మిల లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. అదానీ కంపెనీలకు జగన్ అనుమతులు ఇవ్వడం మీద దర్యాఫ్తు జరపాలని, విద్యుత్ ఒప్పందాలను రద్దు కూడా చేయాలని ఆ లేఖలో కోరారు. అదానీతో ఒప్పందం రాష్ట్రానికి పెను భారమన్నారు. అక్రమ డీల్ కారణంగా పాతికేళ్లపాటు ప్రజలపై లక్షన్నర కోట్ల రూపాయల భారం పడుతోందన్నారు. అదానీతో జరిగిన ఒప్పందాలను రద్దు చేసి, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని షర్మిల సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

స్కీంల కోసం స్కాంలకు పాల్పడ్డట్లు ఆధారాలు సైతం చూపించాయని, అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండ్ కో కి నేరుగా లంచాలు ముట్టినట్లు అమెరికా కోర్ట్ లో తీవ్ర అభియోగాలు మోపబడ్డాయన్నారు. దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే,మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అంధ్ర రాష్ట్ర పరువును తీశారన్నారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత నష్టాల్లోకి నెట్టారు. గంగవరం పోర్టును అదానీ కంపెనీకి అప్పగించడంపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు షర్మిల. అదానీతో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు మొత్తం సీఎంవో నుంచే నడిచాయి. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి ఒప్పుకున్నారు. పిలిచి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టానని చెప్పారని షర్మిల లేఖలో ఆరోపించారు.

Next Story