కడప లోక్‌సభ అభ్యర్థిగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నానిమేషన్ దాఖలు చేశారు. కడప కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేరుకున్న ఆమె ఆర్వోకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమె వెంట వివేకా కూతురు సునీత ఉన్నారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద షర్మిల నివాళి అర్పించారు. నామినేషన్ పత్రాలను అక్కడ ఉంచి తన తండ్రి ఆశీస్సులు తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కడప పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు తనను ఖచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్న షర్మిల పోటీ న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతుందని తెలిపారు.
ఇదిలా ఉంటే.. నామినేషన్‌కు వెళ్లే ముందు షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు. ''ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న సమయంలో దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన వారి శుభాకాంక్షలు అందుకుని విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. నాన్న, బాబాయ్‌ని మరిచిపోలేని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుకుంటున్నా. ధర్మం వైపే కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తున్నా'' షర్మిల పేర్కొన్నారు. ట్వీట్‌తో పాటు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న ఫొటోలతో పాటు కొడుకు-కోడలు, కూతురు, తల్లి విజయమ్మ ఉన్న చిత్రాలను ఈ సందర్భంగా షర్మిల షేర్ చేశారు.