ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని అన్ని సర్వేలు చెబుతున్నాయని ఆమె అన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రానికి ఏ పరిశ్రమ తీసుకొచ్చినా.. రాష్ట్రానికి తెచ్చింది తామేనని నారా లోకేష్ చెబుతున్నారని, బహిరంగ సభలు, ప్రెస్‌మీట్‌లలో వారు ఏం మాట్లాడతున్నారో.. వారికి కూడా అర్థం కావడం లేదని మంత్రి రోజా అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంబానీ, అదానీలు రెడీగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కంపెనీలను స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నారని రోజా స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న సమయంలో అధికార వైసీపీపై బురదజల్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తుండడం సిగ్గుచేటని ఆమె అన్నారు. అనవసర కారణాలతో వైసీపీని విమర్శించడమే టీడీపీ నేతల ధ్యేయమని, ఇలాంటి వైఖరితో పసుపుపార్టీ నేతలు ప్రజల మనసు గెలుచుకోరన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్‌ల తరహాలో చంద్రబాబు అమలు చేసిన పథకం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. అధికారం ఇచ్చినప్పుడు టీడీపీ నేతలు ఉపయోగించుకోలేదని, ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని ఆమె అన్నారు.