దేశ రక్షణ విధుల్లో ఉండగా ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మురళీనాయక్ వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్.జగన్ పరామర్శించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించిన జగన్..వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వీర జవాన్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతి బాయిలకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. మురళి నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తామని తెలిపారు. ఎంతోమందికి మురళీ నాయక్ ఆదర్శంగా నిలిచారని జగన్ పేర్కొన్నారు. మురళి నాయక్ తల్లిదండ్రులకు అండగా ఉంటామని చెప్పారు. అలాగే జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.