Anakapalli: ఫార్మా బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిని ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో వైఎస్ జగన్ పరామర్శించారు.
By అంజి Published on 23 Aug 2024 12:25 PM ISTAnakapalli: ఫార్మా బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
అనకాపల్లిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిని ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు. ఈ ఆస్పత్రిలో 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. బాధితులకు జగన్ ధైర్యం చెప్పారు. . పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు. ప్రమాద ఘటనను జగన్‌కు బాధితులు వివరించారు. ఆస్పత్రిలో బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీసిన జగన్.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.25 లక్షల చొప్పున అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో ప్రమాదం కారణంగా పలువురు మరణించడంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే. మరణించినవారి కుటుంబాలకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటివి జరక్కుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరో ప్రమాదం..
అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మాస్యూటికల్ యూనిట్‌లో పేలుడు సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయి 48 గంటలు గడవకముందే మరో పారిశ్రామిక జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ, పర్వాడలోని సైనర్‌జీన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌లో గురువారం అర్థరాత్రి ఈ దుర్ఘటన జరిగింది.
కార్మికులందరూ జార్ఖండ్ స్థానికులు. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. ఘటనాస్థలిని సందర్శించాలని హోంమంత్రి అనితను కూడా ఆదేశించారు.