విజయవాడ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. జగన్‌తో పాటు వంశీ భార్య పంకజశ్రీ కూడా లోపలికి వెళ్లారు. ఈ క్రమంలోనే వంశీ ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్ రావడంతో జైలు వద్దకు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే జైలు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
అటు వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్టు వైసీపీ ట్వీట్ చేసింది. 'ఇవాళ రాత్రి 7 గంటలకు గన్నవరం కేసుకు సంబంధించిన నిజాన్ని బయటపెట్టబోతున్నాం. అతి పెద్ద రహస్యం బయటపడనుంది' అని పేర్కొంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్‌ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన విషయం తెలిసిందే.