క్షుద్ర పూజలు చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం

YS Jagan Speech At Amma Vodi Launch. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో అమ్మ ఒడి పథకం రెండో విడత లో సంచలన వ్యాఖ్యలు.

By Medi Samrat
Published on : 11 Jan 2021 3:48 PM IST

CM Jagan about amma vadi scheme

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో అమ్మ ఒడి పథకం రెండో విడత నిధుల చెల్లింపులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో మాట్లాడుతూ.. 'విగ్రహాలను ఎవరు ధ్వంసం చేయిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి.. ధ్వంసమైన విగ్రహాలు చూస్తామని ఎందుకు వెళుతున్నారో అర్థం చేసుకోండి', 'రథాలు ఎందుకు తగులబెడుతున్నారో, ఆ తర్వాత రథయాత్ర ఎందుకు చేయబోతున్నారో గమనించండి' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్.

ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టే ముందో, తర్వాతో ఆలయాలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మనం చేసిన మంచి ప్రపంచానికి తెలియొద్దనే దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోరాటం చేస్తున్నామని.. అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసిన వాళ్లు కొత్తవేషం కడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ మీద కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లాంటి వ్యక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు.

ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లను మార్చి వేసే విషయంలో కూడా చాలానే మార్పులు చేశామని చెప్పుకొచ్చారు వైఎస్ జగన్. గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాయని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పేరుతో దోపిడీ జరిగేదని అన్నారు. పరిస్థితులను మార్చేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. పాఠశాలకు విద్యార్ధి రాకపోతే మొదటి రోజు ఫోన్‌లో మెసేజ్‌.. వరుసగా రెండు రోజులు రాకుంటే వాలంటీర్‌ నేరుగా ఇంటికొచ్చి విద్యార్ధి యోగక్షేమాలు తెలుసుకుంటారని వెల్లడించారు. పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చే బాధ్యత తల్లిదండ్రుల కమిటీలతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు, వాలంటీర్లపై ఉందన్నారు.


Next Story