ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం: సీఎం జగన్
YS Jagan reviews on IT-Electronic policy, emphasises on internet to every village. వచ్చే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు
By Medi Samrat
వచ్చే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఐటీ రంగం అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీలో అంశాలపై సమగ్రంగా చర్చించిన సీఎం జగన్..ఇంటర్నెట్ నెట్ వర్క్ బలంగా లేకపోతే, అనుకున్న లక్ష్యాలు సాధించలేమని అన్నారు. ఐటీ-ఎలక్ట్రానిక్ పాలసీపై క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు.
రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్, లైబ్రరీ, కొత్తగా వస్తున్న ఐటీ, ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగు పర్చుకోవడంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినట్లయితే వర్క్‌ఫ్రంహోం చేసుకునేవారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని అన్నారు.
కాగా, విశాఖలో ఏర్పాటు కాబోతున్న యూనివర్సిటీలో రోబోటిక్స్, ఆప్టిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్ సైన్సెస్, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటి వనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధన లక్ష్యంగా ఉండాలన్నారు. దేశంలోని ప్రఖ్యాత ఐఐటీ సహా వివిధ సాంకేతిక సంస్థల్లోని నిపుణులు దీనిపై త్వరలోనే నివేదిక సమర్పిస్తారని అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్ సహా ఇతరాత్రా సాంకేతిక విద్యను అభ్యసించి వారికి నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు ఈ యూనివర్సిటీ ఉపయోగపడాలని సీఎం జగన్ అన్నారు. యూనివర్సిటీ సహా ఐటీ సంబంధిత విభాగాలన్నీ ఒకే చోట ఉండాలని అన్నారు.
తిరుపతి, విశాఖ, బెంగళూరు సమీపంలో మూడు చోట్ల కనీసం రెండు వేల ఎకరాల విస్తరణలో ఐటీ కాన్పెప్ట్ సిటీలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఈ కాన్పెప్ట్ సిటీల్లో మౌలిక సదుపాయాలు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని పేర్కొన్నారు. నిర్మాణంలో ఆర్కిటెక్చర్ యునిక్‌గా ఉండాలని, ప్రతి కాన్పెప్ట్ సిటీకి సంబంధించి ఓ ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ ఉండాలని అన్నారు. పాలసీలో ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలన్నారు. ఐటీ ప్రగతికి దోహదపడాలని, రాష్ట్ర అభివృద్ధికి సహాయపడాలని సూచించారు. అన్ని అంశాలపై ఆలోచనలు చేసి మంచి పాలసీని తీసుకురావాలన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్క్ ఫ్రం పెరిగిందని, వర్క్ ఫ్రం హోమ్‌ను ప్రమోట్ చేయాలని సూచించారు.