'రైతు భరోసా అమలు ఎప్పుడు'.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌

2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదని టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఫైర్‌ అయ్యారు.

By అంజి  Published on  11 Aug 2024 2:45 PM GMT
YS Jagan, AP government,Rithu Bharosa

YS Jagan, AP government,Rithu Bharosa 

2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదని టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఫైర్‌ అయ్యారు. దీనివల్ల రైతులకు ఉచిత పంటలబీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియంను తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్‌-మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నామని వివరించారు. ఖరీఫ్‌ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారంపడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదల చేస్తుందని, ఇదిజరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుందన్నారు. ఇదే మాదిరిగా తమ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూలేని విధంగా రూ.7,802 కోట్లు అందించి వారికి అండగానిలిచామని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

''అయితే 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన మీ (చంద్రబాబు) ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దానిగురించి పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పటికి జూన్‌, జులై మాసాలు గడిచిపోయాయి. ఆగస్టు నెలలో పక్షం రోజులు పూర్తికావొస్తున్నాయి. అయినా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేకపోవడం అత్యంత విచారకరం. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటల దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలను చేపట్టాలి'' అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

''అలాగే రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సొమ్ము ఏటా రూ.20వేలు ఇస్తామని సూపర్‌ సిక్స్‌ హామీల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ దాదాపు పూర్తికావొస్తున్నా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటనా లేదు'' ఎందుకు అని ప్రభుత్వాన్ని వైఎస్‌ జగన్‌ నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో కోవిడ్‌తో ప్రపంచ ఆర్థికవ్యవస్థలన్నీ కుదేలైనా క్రమం తప్పకుండా రైతులకు రైతు భరోసా అందించామన్నారు.

Next Story