దగాపాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతం అయ్యింది. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు తోడుగా నిలిచిన వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు తెలిపారు. ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి కార్యక్రమం అద్దంపట్టింది. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబుగారు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయమన్నారు.
ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్‌ను గుర్తుచేస్తూ అందులో భాగంగా ప్రతిఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20వేలు ఎందుకు ఇవ్వడంలేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా? ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యంచేసి, ఇ-క్రాప్‌ను గాలికి వదిలేసి, దళారీ వ్యవస్థను ప్రోత్సహించి, ధాన్యం కొనుగోళ్లను మధ్యవర్తులకు, మిల్లర్లకు అప్పగించడంవల్ల ఇవాళ ప్రతి బస్తాకు రూ.300-400లు నష్టపోతున్నామని రైతులు నిలదీయడం తప్పా? తమకు కనీస మద్దతు ధర ఇవ్వమని అడగడం నేరమా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.