విశాఖపట్నంలోని ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో భేటీ అయిన ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అటు వైపున చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఉన్నారని, ఇటువైపు జగన్ ఒక్కడే ఉన్నాడని అన్నారు. ఇన్ని కుట్రలు తట్టుకుని జగన్ నిలబడుతున్నారంటే సోషల్ మీడియా యోధుల వల్లేనని తెలిపారు. గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేశారని, వ్యవస్థ ఎంత దిగజారిందనే దానికి గీతాంజలి ఆత్మహత్యే నిదర్శనమని పేర్కొన్నారు. తాను మీకు (సోషల్ మీడియా ప్రతినిధులు) తోడుగా ఉంటానని సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ అని, ఇది రేపు ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందని కచ్చితంగా చెబుతున్నానని అన్నారు. సీఎం వచ్చి ఈ సిటీ నుంచి పరిపాలన ప్రారంభిస్తే.. ఈ నగరం హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి వస్తుందన్నారు. ఐటీ రంగం అభివృద్ధి చెందుతోందని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తనకు తాకిన దెబ్బ కంటికి, మెదడుకు తగల్లేదంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే పనిలో ఉన్నాడు అని అర్థం అని సీఎం జగన్ అన్నారు. కాబట్టి భయం లేదు.. 175కు 175 సీట్లు గెలిచేతి మనమేనని అన్నారు. ఒక్క సీటు తగ్గేదేలేదని, ఎవరొచ్చినా జగన్‌కు భయం లేదని వైసీపీ చీఫ్ స్పష్టం చేశారు.