కూట‌మి ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్‌

గుంటూరు లో దారుణ లైంగిక వేధింపులకు గురై.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ప్రాణం కోల్పోయిన సహానా కుటుంబాన్ని మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.

By Kalasani Durgapraveen  Published on  23 Oct 2024 5:44 PM IST
కూట‌మి ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్‌

గుంటూరు లో దారుణ లైంగిక వేధింపులకు గురై.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ప్రాణం కోల్పోయిన సహానా కుటుంబాన్ని మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో వైయస్‌ జగన్ మాట్లాడ్డారు. రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితి ఉందనడానికి.. శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారిందని చెప్పడానికి.. దళిత చెల్లి పరిస్థితి చూస్తే అర్ధమవుతుందన్నారు. గతంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు ఏ ఆపద వచ్చినా కాపాడేందుకు దిశ యాప్‌ ఉండేదన్నారు. ఏ అక్కచెల్లెమ్మ ఆపదలో ఉన్నా, ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా, లేదా ఫోన్‌ 5సార్లు ఊపితే చాలు, 5 నిమిషాల్లో పోలీసులు వచ్చే వాళ్లు.. అదే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే, చేసినవాడు మనవాడైతే చాలు.. వాడు ఏం చేసినా ఫరవాలేదు. కవరప్‌ చేయడానికి దొంగ కేసులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉందన్న సంకేతం ప్రభుత్వం ఇస్తోందన్నారు.

ఇక్కడ దయనీయ ఘటన జరిగింది. మనకు తేటతెల్లంగా కనిపిస్తున్నా.. ప్రభుత్వం ఏ మాదిరిగా స్పందిస్తోంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ఇక్కడ ఏం జరుగుతోంది అన్నది చూస్తే నా చెల్లెలు తాను చేస్తున్న ఉద్యోగం ప్రదేశం దగ్గర నవీన్‌ అనే వ్యక్తి.. చంద్రబాబుతో దిగిన ఫోటోలు ఉన్నాయి. స్థానిక ఎంపీతో సన్నిహితంగా కూడా ఉన్నాడడు. నవీన్‌ నా చెల్లెలు పని చేస్తున్న ప్రదేశానికి వచ్చి.. కారులో ఎక్కించుకుని పోయి.. తనతో పాటు ఇంకొందరు కలిసి నా చెల్లెలిని వేధించడమే కాకుండా శారీరకంగా హింసించారు. శరీరమంతా కందిపోయిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఫిజికల్‌గా వేధించడమే కాకుండా లైంగికంగా కూడా వేధించి, ఆస్పత్రిలో పడేసి, ఆమె కుటుంబ సభ్యులు రాగానే జారుకోవడం జరిగింది. ఆస్పత్రికి పాప తల్లి, తండ్రి వచ్చే సరికి వారి కళ్లెదుటే జారుకున్నారు. అది కళ్లెదుటే కనిపిస్తోందన్నారు. ఎప్పుడైనా ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? మేము తోడుగా ఉన్నామని చెప్పాలి. అది ధర్మం అన్నారు. తప్పు చేసింది ఎవరైనా సరే, చట్టానికి అతీతం కాదు అన్నారు. కచ్చితంగా శిక్ష పడుతుందన్న భరోసా.. బాధితులకు ఇవ్వాలన్నారు. అయినా ఈ విషయాలు ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చెప్పాలి అని డిమాండు చేశారు. ఎందుకు ఇదే వ్యక్తి, ఆస్పత్రిలో ఈ పేషెంట్‌ను వేర్వేరు ఆస్పత్రులకు తిప్పి, బ్రెయిన్‌డెడ్‌ అయిన పరిస్తితిలో, చివరకు గవర్నమెంట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెపై స్పష్టంగా గాయాలు కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి వచ్చి, తప్పు జరిగిందని అడగడం లేదు.

అన్ని రకాలుగా ఆదుకుంటూ, పరిహారం ఇచ్చి తోడుగా నిలబడలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఈ పని చేస్తే, నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని కాపాడుకుంటూ వచ్చే కార్యక్రమం చేయడానికి, ప్రభుత్వం అడుగులు వేయడం కన్నా హేయమైన పని ఏదైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసిన తర్వాత, టీడీపీకి చెందిన ఆలపాటి రాజా వచ్చాడట. అంతే తప్ప తెనాలి ఎమ్మెల్యే కానీ, మరే నాయకుడు కానీ రాలేదు.హోం మంత్రి అసలే స్పందించలేదు. చేసినవాడు తమ మనిషి కాబట్టి, నిస్సిగ్గుగా కాపాడే ప్రయత్నం జరుగుతోందన్నారు.

ఇక్కడి నుంచి బద్వేలుకు పోతున్నా..

16 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత పెట్రోల్‌ పోసి కాల్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అతి దారుణంగా వారి కూల్‌డ్రింక్స్‌లో మందు కలిపి, వారిపై అత్యాచారం చేసిన ఘటన. అది చేసిన వారెవరు అంటే, టీడీపీకి చెందిన ప్రబుద్ధులు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ నాయకులు వారి పిల్లలు బరి తెగించి మేం ఏం చేసినా మమ్మల్ని ఎవరూ తాకలేరన్న ధీమాతో ఇద్దరు ఆడపిల్లలను బర్త్‌డే పార్టీ అని చెప్పి తీసుకుపోయి కూల్‌డ్రింక్‌లో మందు కలిపి అత్యాచారం చేసిన ఘటన జరిగిందనారు. మరి దాన్ని ఒప్పుకుని క్షమాపణ చెప్పాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు.

స్థానిక మంత్రులు, ఎమ్మెల్యే ఇన్‌వాల్వ్‌ అయి.. పంచాయతీ చేసి దీన్ని బ్రషప్‌ చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. హిందూపురంలో దసరా పండగ రోజున అత్తాకోడలిపై గ్యాంగ్‌రేప్‌ జరిగింది. నిందితులను అరెస్టు చేయలేదు. మూడు రోజుల పాటు వారిని అరెస్టు చేయాలన్న కనీస ఆలోచన కూడా రాలేదు. అక్కడి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఆయన బాధితులను కనీసం పరామర్శించలేదు.. వారిని కలవలేలేదు. అనకాపల్లిలో రాంబల్లి మండలం కుప్పగొండుపాలెంలో 9వ తరగతి చదువుతున్న బాలికను టీడీపీ నాయకుడు సురేష్‌ అనే ప్రేమోన్మాది నరికి చంపాడు. గతంలో ఆ సురేష్‌ వేధిస్తే ఫిర్యాదు చేస్తే అరెస్టు చేసి జైలుకూ పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ వేధించాడన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలులో బిజీగా ఉన్న పోలీసులు పట్టించుకోకపోవడంతో సురేష్ ఆ పాపను దారుణంగా చంపాడన్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర నెలల్లోనే.. ఏకంగా 77 మంది మహిళలు, పిల్లల మీద ఈ మాదిరిగా దారుణమైన అత్యాచారాలు. ఏడుగురు హత్యకు గురి కాగా, 5గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ వారు ఏ తప్పు చేసినా.. మీరు చేయండి. మేము వెనకుసుకొస్తాం. మీకేమీ జగరనివ్వం అని చెప్పి మేము సపోర్ట్‌ చేస్తామని చెప్పి చంద్రబాబు దగ్గరుండి చంద్రబాబు ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉందన్నారు. అదే వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒక దిశ యాప్‌ తీసుకొచ్చి 1.56 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించాం అన్నారు.

ఆపదలో ఉన్న ఏ అక్కచెల్లెమ్మ అయినా, ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే, లేదా 5సార్లు ఫోన్‌ ఊపితే చాలు, వెంటనే ఆ అక్కచెల్లెమ్మకు పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చేది. ఒకవేళ ఆ అక్కచెల్లెమ్మ ఫోన్‌ ఎత్తకపోతే, 10 నిమిషాల్లో పోలీసులు వచ్చేవారు. ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడేవారన్నారు. ఆ విధంగా దాదాపు 31,607 మంది బాలికలు, మహిళలను దిశ యాప్‌ ద్వారా కాపాడడం జరిగిందన్నారు. గతంలో ఏనాడూ లేని విధంగా, 18 దిశ పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టుల, 12 మహిళా కోర్టులు, ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలు.. పోలీసులకు దీనికోసమే కేటాయించడం జరిగిందన్నారు. దీని కోసం 18 దిశ క్రైమ్‌ మేనేజ్‌మెంట్‌ వాహనాలను కూడా క్రైమ్‌ను ఛేదించడం కోసం ఏర్పాటు చేశాం అన్నారు.

దిశ యాప్‌ అంత చక్కగా పని చేస్తున్న పరిస్థితుల్లో.. ఏకంగా అత్యుత్తమ పోలీసింగ్‌లో జాతీయ స్థాయిలో దిశ యాప్‌కు 19 అవార్డులు వచ్చాయి అని తెలిపారు. అంటే 19 జాతీయ అవార్డులు దిశయాప్‌కు కేంద్రం ఇవ్వడం జరిగిందన్నారు. అక్కచెల్లెమ్మలు ఈ రాష్ట్రంలో బ్రతికే పరిస్థితి లేకుండా చేశాడన్నారు. జరుగుతున్న ఘటనలకు క్షమాపణ చెప్పండి. ప్రతి బాధితుడి వద్దకు మంత్రులను పంపించి.. రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తూ.. మళ్లీ ఇలాంటివి జరగనివ్వము అని చెప్పి లెంపలు వేసుకోవాలి.. లేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడు అవుతాడన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోని స్పందించాలన్నారు.

మీరేం బాధ పడకండి.. వచ్చేది మన ప్రభుత్వమే..

మొదట తప్పు జరిగింది అని ఒప్పుకోవాలి. అన్యాయమైన ఘటన జరిగింది. ఒక అభాగ్యురాలికి అన్యాయం జరిగింది. కానీ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదన్నారు. అసలు ప్రభుత్వ బాధ్యత ఏమిటి? ఇలాంటి అభాగ్యులకు తోడుగా నిలబడాలి. అన్యాయమై పోయిన వారికి న్యాయం చేయాలి. వారికి భరోసా ఇవ్వాలిన్నారు. వీరికి తోడుగా ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు రాలేదు అని మండిపడారు. పోలీసులు న్యాయంగా దర్యాప్తు చేస్తే, అన్ని వాస్తవాలు బయటకొస్తాయి అన్నారు. పేదలకు ప్రభుత్వం తోడుగా ఉన్నామని చెప్పాలి. కానీ ఈ ప్రభుత్వం ఆ పని చేయడం లేదన్నారు. ఆ పని చేయకపోగా..వారు మా పార్టీ వారని నిందించడం సరైనదేనా? ఆ తల్లికి మేము తోడుగా నిలబడితే.. మాపై నిందలు వేయడం సబబా? అన్నారు. మీరేం బాధ పడకండి. వచ్చేది మన ప్రభుత్వమే.. మేము వచ్చిన తర్వాత, వీరందరినీ ఏరి ఏరి జైల్లో పెడతామ‌న్నారు.

Next Story