భారీగా రిగ్గింగ్‌.. ఈ ఎన్నికలను రద్దు చేయాలి: వైఎస్‌ జగన్‌

పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను తీవ్రవాదుల్లా టీడీపీ నేతలు హైజాక్‌ చేశారని వైఎస్‌ జగన్‌ ఎక్స్‌లో ఫైర్‌ అయ్యారు.

By అంజి
Published on : 13 Aug 2025 6:59 AM IST

YS Jagan, Pulivendula, Ontimitta, ZPTC, by elections, APnews

భారీగా రిగ్గింగ్‌.. ఈ ఎన్నికలను రద్దు చేయాలి: వైఎస్‌ జగన్‌

అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను తీవ్రవాదుల్లా టీడీపీ నేతలు హైజాక్‌ చేశారని వైఎస్‌ జగన్‌ ఎక్స్‌లో ఫైర్‌ అయ్యారు. 'చంద్రబాబు గుండాలా అరాచకాలు చేశారు. రౌడీల రాజ్యం నడిపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గాయపరిచిన ఈ రోజు బ్లాక్‌ డే. ఆయన సీఎంగా ఉండగా ప్రజాస్వామ్యం డొల్లని రుజువైంది. చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు ఒట్టిమాటలే. ఈ ఎన్నికలను రద్దు చేసి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ నిర్వహించాలి' అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

''పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఇవాళ ఇన్ని అక్రమాలు జరిగినా, అడ్డుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనందాల్చడం విచారకరం. ప్రతి బూత్‌కు సంబంధించి వెబ్‌కాస్టింగ్‌ను వైయస్సార్‌సీపీ అభ్య‌ర్థికి ఇవ్వాలని, పోలింగ్‌ బూత్‌ ఆవరణలో సీసీ ఫుటేజీని కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఆ ఫుటేజీ ఇస్తే మేమే విశ్లేషించి ఎవరెవరు బయటనుంచి వచ్చి ఓట్లేశారో కూడా గుర్తించి ఎన్నికల సంఘానికి ఇస్తాం. రాజ్యాంగ వ్యవస్థల మీద మాకున్న విశ్వాసంతో, ఎన్నికల అక్రమాలపై సాక్ష్యాలు, ఆధారాలతో న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తాం. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారంతా ఈ అన్యాయాన్ని నిలదీస్తూ, కేంద్రబలగాల ఆధ్వర్యంలో, వారి భద్రత నడుమ తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరుతాం'' అని అన్నారు.

''చంద్రబాబు సీఎం సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టిమాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైంది. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడ్డం, ఆమేరకు ప్రజలకు సహకరిస్తూ, తగిన సదుపాయాలు ఇస్తూ, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి. కాని, చంద్రబాబుగారు ప్రభుత్వాన్ని వాడుకుని తన ప్రభుత్వ సిబ్బంది, పోలీసులచేతే ఏకంగా రిగ్గింగ్‌ చేయించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుతాం? చంద్రబాబుగారు.. ఓట్లను రిగ్గింగ్‌ చేయగలరేమో కాని, ప్రజల హృదయాలను కాదు'' అని వైఎస్ జగన్‌ అన్నారు.

Next Story