నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన తొలి భారతీయురాలు పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, జాహ్నవి కుటుంబ సభ్యులు ఉన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి బయలుదేరే ముందు ముఖ్యమంత్రిని జాహ్నవి కలిశారు.
పైలెట్ ఆస్ట్రొనాట్ అవ్వాలన్న తన లక్ష్యాన్ని వివరించి, ఇందుకు అవసరమైన శిక్షణకు అయ్యే ఖర్చుకు సాయం చేయాల్సిందిగా ఆమె సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్ఫూర్తితో అంతరిక్షంలోకి అడుగుపెట్టేందుకు కృషిచేస్తున్నట్లు ఆమె సీఎంకు వివరించారు. జాహ్నవి విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు. కాగా.. అచ్చం చంద్రుడిని తలపించే కృత్రిమ వాతావరణంలో జాహ్నవి దంగేటి అంతరిక్ష శిక్షణ పొందారు. పోలండ్‌లోని అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో ఆమె శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదువుతున్నారు.