వైసీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడ వరద ముంపును ఎదుర్కొని ఉండేది కాదని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుడమేరు ముంపునకు వైసీపీ పాలన కారణం. గత టీడీపీ హయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానల్ 37,500 క్యూసెక్కులకు పెంచేలా రూ.464 కోట్లతో టెండర్లు అప్పగించి 80 శాతం పనులు పూర్తి చేశాం. వైసీపీ ప్రభుత్వంలో బుడమేరు విస్తరణకు నిధులు ఉన్నా మిగిలిన 20 శాతం పనులకు సంబంధించి తట్ట మట్టిగానీ, బస్తా సిమెంట్ గానీ చేయలేదు..అని మంత్రి నిమ్మల ఆరోపించారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు వెళ్లే ఛానల్ విస్తరణ పనులకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. బుడమేరు గట్లు మరమ్మతుల కోసం రూ.39.05 కోట్ల రూపాయలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తాం. బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. బుడమేరు ఓల్డ్ ఛానెల్‌కు సమాంతరంగా మరో కొత్త ఛానెల్‌ను కూడా 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద కేంద్రం సహకారంతో ముందుకు వెళ్తాం..అని మంత్రి నిమ్మల తెలిపారు.