షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికార తగాదా: విజయసాయిరెడ్డి

ఏపీ కాంగ్రెస్‌ వైఎస్‌ షర్మిల.. మాజీ సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి స్పందించారు.

By అంజి
Published on : 27 Oct 2024 1:30 PM IST

YCP MP Vijaya Sai Reddy, YS Sharmila, YS Jagan, APnews

షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికార తగాదా: విజయసాయిరెడ్డి

ఏపీ కాంగ్రెస్‌ వైఎస్‌ షర్మిల.. మాజీ సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి స్పందించారు. వైఎస్‌ షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికార తగాదా అని విమర్శించారు. 'ఆమె ప్రెస్‌మీట్‌ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికని చెప్పారు. కానీ ఆ ప్రెస్‌మీట్‌ చంద్రబాబు కోసం పెట్టింది. ఆయన కళ్లలో ఆనందం చూసేందుకే ఆమె మీడియా ముందుకొచ్చారు. కొంత కాలంగా వైఎస్‌ జగన్‌ను తిట్టేందుకే ప్రత్యేకంగా ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. జగన్ మళ్లీ సీఎం కావొద్దనే ఆమె పని చేస్తున్నారు' అని విజయ సాయిరెడ్డి అన్నారు.

ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు.. కానీ జగన్ మళ్ళీ సీఎం కావొద్దని షర్మిల‌‌ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. 95 శాతం షర్మిల ప్రెస్ మీట్లు జగన్‌ను తిట్టడానికి పెట్టినవేనని అన్నారు. వైఎస్ మరణానికి కారణమైన కాంగ్రెస్, చంద్రబాబుతో షర్మిల చేతులు కలపటం బాధాకరమని అన్నారు. తండ్రి మరణానికి చంద్రబాబు కారణమని గతంలో అనేకసార్లు షర్మిల చెప్పలేదా అని విజయ సాయిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్‌ చనిపోవడానికి కారకులు ఎవరో గుండెపై చేయి వేసుకుని షర్మిల చెప్పాలన్నారు. చంద్రబాబు అజెండాను షర్మిల‌ అమలు చేస్తున్నారని విమర్శించారు.

Next Story