పల్నాడు జిల్లా గురజాల నియోజకర్గంలో రాజకీయం వేడెక్కింది. గురజాల అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. గురజాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. కాగా, మహేశ్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 2019-2022 మధ్య గురజాల అభివృద్ధికి రూ.2,673 కోట్లు కేటాయించిందన్నారు. టీడీపీ సహా ఏ పార్టీతోనైనా చర్చకు సిద్ధమన్నారు. గత 40 నెలల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
పల్నాడు జిల్లా గురజాలలో వెనుకబడిన ప్రాంత అభివృద్ధి వైఎస్‌ఆర్ హయాంలోనే ప్రారంభమైందన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరిచి ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. టీడీపీ హయాంలో ఒక్క పథకం అయినా చేపట్టారా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో చర్చకు అత్యంత ప్రాధాన్యం ఉందని ఎమ్మెల్యే కాసు అన్నారు. అయితే తన హయాంలోనే గురజాలలో అభివృద్ధి పరుగులు పెట్టిందని, కానీ ప్రస్తుతం అభివృద్ధి జరగడం లేదని యరపతినేని శ్రీనివాస రావు విమర్శించారు.
నియోజకవర్గ అభివృద్ధిపపై ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విసిరిన సవాల్‌ను యరపతినేని శ్రీనివాసరావు స్వీకరించారు. ఈ క్రమంలో నేడు కాసు మహేష్ రెడ్డి గురజాల గెస్ట్ హౌజ్‌కు చేరుకున్నారు. అయితే అభివృద్ధి ఆటవిడుపు కాదని, ఇవాళ కాకుండా మరో 10 రోజుల్లో అభివృద్ధిపై చర్చకు తేదిని ప్రకటిస్తామని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ప్రకటించారు. ఆదివారం పేరుతో యరపతినేని శ్రీనివాస రావు చర్చకు దూరంగా పారిపోయారని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. వీరిద్దరి బహిరంగ సవాల్‌తో ప్రజలు కూడా నియోజవర్గ అభివృద్ధిపై చర్చించుకుంటున్నారు.