పవన్ సినిమాలంటే క్యూ కడతారు..కానీ ఓట్లెందుకు వేస్తారు?: ద్వారంపూడి
పవన్ సినిమాలంటే జనాలు థియేటర్ల దగ్గర నిలబడి చూస్తారు కానీ..
By Srikanth Gundamalla
పవన్ సినిమాలంటే క్యూ కడతారు..కానీ ఓట్లెందుకు వేస్తారు?: ద్వారంపూడి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అని తీవ్రంగా విమర్శించారు. చాలా ఏళ్ల క్రితం పార్టీ పెట్టారు అప్పటి నుంచి ఏం చేశావని ప్రశ్నించారు. పార్టీ స్థాపించినప్పుడు ఉన్నవారు ఇప్పుడు జనసేనలో లేరన్నారు. పొలిటికల్‌గా పవన్ కళ్యాణ్ జీరో అని విమర్శించారు ద్వారంపూడి చంద్రశేఖర్. వారాహి యాత్రపైనా స్పందిస్తూ.. యాత్ర పేరుతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తనపై అన్నీ తప్పుడు ఆరోపణలే చేస్తున్నారని అన్నారు. తనని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్.
పవన్ కళ్యాణ్ సినిమాలంటే జనాలు థియేటర్ల దగ్గర గంటల తరబడి నిలబడి టికెట్లు కొనుక్కుని సినిమాలు చూస్తారు కానీ.. ఓటింగ్ క్యూలైన్లో నిలబడి పవన్‌కు మద్దతు ఇవ్వరని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనే కల కేవలం ఆయనకు సినిమాల ద్వారా మాత్రమే తీరుతుందని విమర్శించారు. గతంలో రెండు చోట్ల పోటీ చేస్తే రెండు స్థానాల్లోనూ ఓడిపోయారని గుర్తు చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్. పవన్ ప్యాకేజీ స్టార్ అని.. ప్యాకేజ్ కుదరలేదు కాబట్టే వారాహి యాత్ర పేరుతో రోడ్లపైకి వచ్చారని ఆరోపించారు. యాత్రలో పవన్ తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే ద్వారంపూడి అన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే ద్వారంపూడి. పవన్‌కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలన్నారు. పోటీ చేసేందుకు ఒప్పుకోకపోతే పిరికివాడి అని ఒప్పుకున్నట్లే అని అన్నారు. తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. పవన్ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ సవాల్ విసిరారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్.