ఎమ్మెల్యే కోటంరెడ్డిపై చర్యలు ఎందుకు?: సజ్జల
YCP leaders responded to MLA Kotam Reddy's allegations. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్
By అంజి Published on 1 Feb 2023 9:13 AM GMTనెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి సర్పంచ్‌ల సమావేశంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఉద్దేశం ఎంటే స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా చర్యలు ఏముంటాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడాల్సిన అవసరం ఏ మాత్రం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలపై నమ్మకం ఉంచి పాలన సాగిస్తున్నారని.. తప్పించి ఫోన్ ట్యాపింగ్‌ల నుంచి కాదన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఇంకా ఎవరినీ నియమించలేదని సజ్జల స్పష్టం చేశారు. నేతలను ఎలా ప్రలోభపెట్టాలో తెలిసిన చంద్రబాబు నాయుడు చేతిలో కోటంరెడ్డి పడ్డారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పైన ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ఫోన్లు ట్యాపింగ్ చేసిన అనుమానాలు ఉంటే.. ఎవరైనా, ఎవరికైనా ఈ విషయంలో ఫిర్యాదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పదవి రాలేదని అసంతృప్తితోనే ఆయన బయటకు వెళుతున్నారని తాము భావిస్తున్నామని సజ్జల అన్నారు. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమై పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. కోటంరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఫోన్ రికార్డింగ్, ట్యాపింగ్ వేరు అని అభిప్రాయపడ్డారు. ఈ ఆడియో క్లిప్‌ను కోటంరెడ్డి స్నేహితుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌కు పంపించి ఉండవచ్చని, రికార్డు చేసిన ఆడియో క్లిప్‌ను ఇంటెలిజెన్స్ చీఫ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పంపించారని ఆయన అన్నారు. కోటంరెడ్డి పార్టీ మారాలనుకుంటే మారొచ్చని, తప్పుడు ఆరోపణలు చేయవద్దని అమర్‌నాథ్ సూచించారు. అయితే ఇది కాల్ రికార్డింగ్ అని నిరూపించాలని అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి వెంటనే స్పందించారు. తనకు, తన స్నేహితుడికి ఐఫోన్ ఉందని, ఐఫోన్‌లలో కాల్‌లను రికార్డ్ చేయడం అసాధ్యమని అతను స్పష్టం చేశాడు.