వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందానన్నారు. త్వరలో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు. గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా రెడీ చేసుకున్నానని వివరించారు. రెండు, మూడు రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు చెప్పారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతానన్నారు. కాగా పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఎన్నికల ముందు శపథం చేసిన విషయం తెలిసిందే.
కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదని పేర్కొన్నారు. జనం కోసం కష్టపడ్డ జగన్ ని ప్రజలు గౌరవించక పోవడం బాధాకరమని పద్మనాభం అన్నారు. తన రాజకీయ ప్రయాణం జగన్ తోనే కొనసాగుతుందని తెలిపారు. జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ప్రజలు ఆదరించలేదో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమానికి ప్రజలు ఓటు వేయకపోతే.. రాబోయే రోజుల్లో ఏ సీఎం కూడా అటువైపు చూసే అవకాశం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కూటమికి ముద్రగడ పద్మనాభం శుభాకాంక్షలు తెలిపారు.