తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగులుతున్నాయని చెప్పుకుంటున్నారు: చంద్రబాబు

YCP leader Kotamreddy Giridhar Reddy joined In TDP. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ నేత గిరిధర్ రెడ్డి నేడు టీడీపీలో చేరారు.

By M.S.R  Published on  24 March 2023 11:46 AM GMT
తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగులుతున్నాయని చెప్పుకుంటున్నారు: చంద్రబాబు

TDP Leader Chandrababu


నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ నేత గిరిధర్ రెడ్డి నేడు టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచుకున్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి పసుపు కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. వైసీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గిరిధర్ రెడ్డి టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టీలో చేరారని అన్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రమంతా గెలుస్తుంది. గిరిధర్ రెడ్డిలాంటి వారు పార్టీలోకి రావడంవల్ల పార్టీ బలం ఇంకా పెరుగుతుందని అన్నారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. గిరిధర్ రెడ్డి లాంటి సేవాభావం ఉన్నవారే జగన్ పార్టీలో ఉండలేకపోతే, సామాన్య కార్యకర్తలు ఎలా ఉంటారు? జగన్ నమ్మిన వారిని నట్టేట ముంచే రకం. జగన్మోహన్ రెడ్డి ఇక మళ్లీ గెలవడని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అంతా సైకో పోవాలి.. సైకిల్ రావాలనే నినాదం మారుమోగుతోందని తెలిపారు. సజ్జల బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారని, మొన్న చదువుకున్న వాళ్లు తమ పార్టీకి ఓటేయలేదని అన్నాడు. మరి నిన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓటేయలేదని చంద్రబాబు అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు రావడాన్ని దేవుడి స్క్రిప్ట్ అని జగన్ ఎద్దేవా చేశాడు. మరి, నిన్న 23వ తేదీన, 23 ఓట్లతో, 2023లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవడం కూడా దేవుడి స్క్రిప్టే! అని అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఫలితాలు చూశాక, జగన్ కు నిద్రపట్టడంలేదని, తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగులుతున్నాయని చెప్పుకుంటున్నారన్నారు. అధికారంలో ఉన్నవారు హుందాగా, గౌరవంగా ఉండాలి. ప్రజలకు మేలు చేయాలి. అబద్ధాలు, అసత్యాలతో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారన్నారు చంద్రబాబు. పట్టభద్రులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పై తిరగబడ్డారు. ఇప్పుడు వీచింది చిన్నగాలే, భవిష్యత్ లో టీడీపీ సునామీ దెబ్బకు వైసీపీ కొట్టుకుపోతుందని అన్నారు చంద్రబాబు.


Next Story