ఎగ్‌ పఫ్‌ల కోసం రూ.3.6 కోట్లు ఖర్చని ట్వీట్‌.. ఖండించిన వైసీపీ

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎగ్‌ పఫ్‌ల కోసం రూ.3.6 కోట్లు ఖర్చు చేశారన్న ఓ నేషనల్‌ మీడియా జర్నలిస్ట్‌ ట్వీట్‌పై వైసీపీ మండిపడింది.

By అంజి  Published on  21 Aug 2024 3:35 PM IST
YCP, egg puffs, APNews, Nara Lokesh

ఎగ్‌ పఫ్‌ల కోసం రూ.3.6 కోట్లు ఖర్చని ట్వీట్‌.. ఖండించిన వైసీపీ 

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎగ్‌ పఫ్‌ల కోసం రూ.3.6 కోట్లు ఖర్చు చేశారన్న ఓ నేషనల్‌ మీడియా జర్నలిస్ట్‌ ట్వీట్‌పై వైసీపీ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేని వదంతులను నమ్మడం బాధాకరమని పేర్కొంది.

అసలు వాస్తవం ఎంత ఉందనే విషయాన్ని పార్టీ వర్గాల నుంచి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం పట్ల వైసీపీ అభ్యంతరం తెలిపింది. అధికారికంగా ధృవీకరించని, నిరాధారమైన సమాచారాన్ని జాతీయ మీడియా జర్నలిస్టులు ఎలా ట్వీట్ చేయగలుగుతారని ప్రశ్నించింది. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, వాస్తవాలు తెలుసుకుని న్యూస్‌ వేయాలని హితవు పలికింది.

ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారం కోల్పోయిన నేప‌థ్యంలో ఆయ‌న హ‌యాంలో అవినీతి జరిగిందని కొత్తగా ఏర్పడిన టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గత ఐదేళ్లలో జరిగిన అన్ని కుంభకోణాలపై సమగ్ర విచారణకు ఆదేశించి కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతోంది.

ఈ క్రమంలోనే గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి కార్యాలయం ఎగ్‌ పఫ్‌ల కోసం రూ.3.62 కోట్లు ఖర్చు చేసిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. సగటున, ఈ తినుబండారాల కోసం ప్రభుత్వం సంవత్సరానికి 72 లక్షలు ఖర్చు చేసిందని, అంటే ప్రతిరోజు 993 ఎగ్ పఫ్‌లను తిన్నారని, ఐదేళ్లలో మొత్తం 18 లక్షల ఎగ్ పఫ్‌లు తిన్నారని కొన్ని పత్రికలు వార్తలు రాశాయి. ప్రభుత్వ ధనాన్ని స్వేచ్ఛగా ఖర్చు చేశారు.. ఇది అధికార దుర్వినియోగం కాదా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మంత్రి నారా లోకేష్‌ టీ, బిస్కెట్ల ఖర్చులపై జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఫ్యాక్ట్‌ చెక్‌ ఖండించింది. ఇదంతా పూర్తి అసత్యమని, ప్రజలు నమ్మొద్దని కోరింది. ఇటువంటి ఫేక్‌ పోస్టులు పెట్టేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా అత్యంత ఖరీదైన టీ కోసం నారా లోకేష్‌ నెలకు రూ.60 లక్షలు, బిస్కెట్లకు నెలకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నారని పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

Next Story