'వైసీపీ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది'.. డొక్కా మాణిక్య వర ప్రసాద్ సంచలన ఆరోపణలు
వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి మారిన టీడీపీ నేత డొక్కా మాణిక్య వర ప్రసాద్ వైఎస్సార్సీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 5 Jun 2024 2:00 PM IST'వైసీపీ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది'.. డొక్కా మాణిక్య వర ప్రసాద్ సంచలన ఆరోపణలు
వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి మారిన టీడీపీ నేత డొక్కా మాణిక్య వర ప్రసాద్ వైఎస్సార్సీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతల ఫోన్‌లు ట్యాప్ చేశారని మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు.
ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలను ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పలువురు నేతలను బెదిరించిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వాన్ని మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడిందన్న విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే నిందితుల్ని కటకటాల వెనక్కి పంపింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం విపక్ష బీఆర్ఎస్ ను కుదిపేస్తున్న నేపథ్యంలో ఏపీలోనూ అవే తరహా ఆరోపణలు రావడంతో వైసీపీకి ఇబ్బందులు తప్పేలా లేవు.
మరోవైపు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారని జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సింగపూర్‌లో కూర్చొని టెక్నికల్‌గా ట్యాంపరింగ్ చేశారని, బార్‌కోడ్‌ల ద్వారా ఇలా చేశారని అనుమానిస్తున్నామని తెలిపారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి ఇదంతా నడిపించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగిందని, దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్తామని రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.