అమరావతి: తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం పద్ధతులకు విరుద్ధమని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే అధికార ఎన్డీయే కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన నిర్ణయించినట్టుందని జగన్ పేర్కొన్నారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఈ హోదా కోసం 10% సీట్లు ఉండాలని చట్టంలో లేదు అని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజాసమస్యలను బలంగా వినిపించొచ్చని తెలిపారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు.
చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని స్పీకర్ తన లేఖను పరిశీలించాలని కోరుతున్నానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. తనను ప్రతిపక్ష నేతగా, తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్ సి అయ్యన్నపాత్రుడును అభ్యర్థించారు. ఇటీవలి ఏకకాల ఎన్నికలలో వైసీపీ ఘోర ఎన్నికల పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 అసెంబ్లీ, నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది.