అమరావతి: వరదల అంశాన్ని డైవర్ట్ చేసేందుకే మాజీ ఎంపీ సురేశ్‌ను అరెస్ట్ చేశారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అన్నారు. సురేశ్‌తో జైల్లో ములాఖత్ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు. ''తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తున్నారు. ఎల్లకాలం మీరు ఉండరు. రేపు మీ నాయకులందరికీ ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో ఉంటారు'' అని జగన్ వార్నింగ్ ఇచ్చారు. దొంగ కేసులు పెడుతూ అధికారం చలాయిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని వైఎస్ జగన్ హెచ్చరించారు. గతంలో టీడీపీ నేత పట్టాభి సిట్టింగ్ సీఎం అయిన తననే బొసిడికే అని దూషించారని, అందుకే తమ కార్యకర్తలకు కోపం వచ్చి టీడీపీ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారని చెప్పారు.
తమ కార్యకర్తలపై టీడీపీ దాడి చేసి తప్పుడు కేసులు పెట్టిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు టీడీపీవేనని, వీటిలోనే విజయోత్సవ ర్యాలీలు చేశారన్నారు. తన ఇంటిని రక్షించుకునేందుకు సీఎం చంద్రబాబు విజయవాడను ముంచేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశారని అన్నారు. చంద్రబాబు చేసిన తప్పుడు పనికి 60 మందికిపైగా చనిపోయారని, 60 మందిని పొట్టనపెట్టుకున్న చంద్రబాబుపై కేసు ఎందుకు పెట్టరు? అని ప్రశ్నించారు. చంద్రబాబు బోట్ల రాజకీయం చేస్తున్నారని, చంద్రబాబు, ఆయన పార్టీ భూస్థాపితం అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైఎస్ జగన్ ఫైరయ్యారు.