పులివెందుల నా సొంతగడ్డ.. నా ప్రాణం: సీఎం జగన్
తన సొంత గడ్డ పులివెందుల అని, తన ప్రాణమని సీఎం జగన్ అన్నారు. ప్రతీ కష్టంలో పులివెందుల తన వెంట నడిచిందన్నారు.
By అంజి Published on 25 April 2024 11:09 AM ISTపులివెందుల నా సొంతగడ్డ.. నా ప్రాణం: సీఎం జగన్
తన సొంత గడ్డ పులివెందుల అని, తన ప్రాణమని సీఎం జగన్ అన్నారు. ప్రతీ కష్టంలో పులివెందుల తన వెంట నడిచిందన్నారు. పులివెందుల అంటేనే నమ్మకం, అభివృద్ధి, సక్సెస్ స్టోరీ అని జగన్ కొనియాడారు. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్ అని అన్నారు. టీడీపీ నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలేనని అన్నారు. కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు.. కృష్ణా నది నీళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు.
తనను ఎదుర్కోలేక.. ఒక్కరి మీదకు ఇంతమంది ఏకం అవుతున్నారని సీఎం జగన్ అన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా.. కాదా? అని ప్రశ్నించారు. కూటమి నేతల కుట్రలో భాగంగా వైఎస్‌ఆర్ వారసులం అంటూ కొందరు ప్రజల్లోకి వస్తున్నారని సీఎం జగన్ అన్నారు. ఆ మహానేతకు వారసులు ఎవరో ప్రజలే చెప్పాలన్నారు. వైఎస్‌ఆర్ చనిపోయాక ఆయనపై కేసులు వేసింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ పేరును కనబడకుండా చేయాలనుకుని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుట్రలు చేసిందన్నారు.
అలాంటి మన శత్రువులతో కలిసిన వీళ్లా వైఎస్‌ఆర్ వారసులు, మన ఓట్లను విడగొట్టే కుట్ర చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. పులివెందుల బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. 'చిన్నాన్నకు రెండో భార్య, సంతానం ఉన్న మాట వాస్తవమా కాదా? ఎవరు ఫోన్ చేయడం వల్ల అవినాష్ ఆయన ఇంటికి వెళ్లాడు? ఈ ప్రశ్నలకు వాళ్లు సమాధానం చెప్పాలి. అవినాష్ ఏ తప్పూ చేయలేదు. అందుకే టికెట్ ఇచ్చాను. మా అందరికంటే చిన్నపిల్లోడైన అవినాష్‌ను తెరమరుగు చేయాలని చూడటం చాలా దారుణం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.