జగన్నాటకం.. అంటూ జగన్ పై యనమల ఆరోపణలు..!

Yanamala Comments on Jagan. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని తమ చేతికి మట్టి అంటకుండా కేంద్రం ద్వారా అమ్మించి తన బినామీల పరం చేయాలన్నదే జగన్నాటకం.

By Medi Samrat  Published on  19 Feb 2021 1:50 PM IST
Yanamala Comments on Jagan.

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని తమ చేతికి మట్టి అంటకుండా కేంద్రం ద్వారా అమ్మించి తన బినామీల పరం చేయాలన్నదే జగన్నాటకం" అని.. తెలుగుదేశం సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. నేరం తనది కాదు.. తన బినామీల భూదాహానిది అనే రీతిలో జగన్‌ వ్యవహరిస్తున్నారని.. మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ భూముల్ని తన బినామీలకు కట్టబెట్టే రహస్య అజెండా తొలి అంకంలో భాగంగానే జగన్‌ ప్రధానికి లేఖ రాశారని మండిపడ్డారు.

ఏ1 జగన్‌, ‌ఏ2 విజయసాయిరెడ్డిలే అమ్మకం కుట్రలో సూత్రధారులు అయితే.. పాత్రధారులు అరబిందో, హెటిరో అని దుయ్యబట్టారు. కాకినాడ సెజ్, బేపార్క్ భూములను ఇప్పటికే హస్తగతం చేసుకున్నారన్న యనమల... తొలుత విశాఖ భూములు, ఆశ్రమ భూములపై గద్దల్లా వాలి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ భూములపైనే కన్నేశారని ఆరోపించారు. సీఎం మాటలను బట్టే పోస్కోతో ఒప్పందం నిజమేనని తెలుస్తోందన్నారు.

ఉక్కు కర్మాగారానికి ఇచ్చిన భూముల అమ్మకం చట్టపరంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. ఎకరా 3 కోట్లు రూపాయలు విలువ చేసే ఈ భూముల ప్రయోజనం స్థానికులకే దక్కాలి తప్ప జగన్ బినామీల పరం కారాదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి తమ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కార్మిక సంఘాలు కోరుతుంటే వారిని పట్టించుకోకుండా యాగానికి వెళ్లటం ఎంతవరకు సబబని నిలదీశారు.




Next Story