ఆ ఇద్దరూ మహిళలే. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఈ క్రమంలో ఓ యువతిలో పురుషుడి లక్షణాలు ఉన్నాయని.. నీవు అబ్బాయిగా మారితే పెళ్లి చేసుకుంటానని మరో యువతి చెప్పింది. ఆ యువతి మాటలు నమ్మి హిజ్రాగా మారింది. అయితే.. హిజ్రాగా మారిన తరువాత సదరు మహిళ పెళ్లికి నిరాకరించింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన ఓ యువతికి తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు. శిక్షణ సమయంలో ఆమెకు ఓ మహిళ పరిచయమైంది. ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యానికి దారితీసింది. యువతికి అబ్బాయి లక్షణాలు ఉన్నాయని.. నీవు హిజ్రాగా మారితే పెళ్లి చేసుకుంటానని పరిచయమైన మహిళ చెప్పింది. ఆమె మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది. ఇరువురు కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. తాజాగా యువతిని పెళ్లాడేందుకు ఆ మహిళ నిరాకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హిజ్రాగా మారమని చెప్పి, మారిన తర్వాత తనను మోసం చేసిందంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఎలా పరిష్కరించాలో తెలియక సతమతం అవుతున్నారు.