ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 'హచికో' శునకం తరహా ఘటన చోటు చేసుకుంది. తన యాజమాని కోసం రోజుల తరబడి రైల్వే స్టేషన్‌లో ఎదురు చూసిన హచికో మాదిరిగానే.. కోనసీమ జిల్లాలో ఓ శునకం తనను పెంచిన యాజమాని కోసం చాలా సేపు ఎదురుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐ. పోలవరం మండలం ఎదురులంక బాలయోగి వారధి పైనుంచి గౌతమీ గోదావరిలోకి దూకి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన ఆమె పెంపుడు శునకం గట్టిగట్టిగా అరుస్తూ పరుగులు పెట్టింది. హచికో తరహాలో ఆమె వదిలిన చెప్పుల దగ్గరే ఉండి.. పెంపుడు శునకం ఆమె కోసం ఎదురు చూసింది.
తనను ప్రేమగా పెంచుకున్న యజమాని తప్పక తిరిగి వస్తుందని.. దీనంగా ఆమె చెప్పుల చుట్టే తిరుగుతూ కనిపించింది. మధ్య మధ్యలో గోదావరి వైపు చూస్తూ ఎదురుచూడటం, వారిధిపై వెళ్తున్న వాహనదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సన్నివేశం కంటపడిన చూపరుల గుండెలు బరువెక్కాయి. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.