కృష్ణంరాజు మృతితో.. మొగల్తూరులో విషాదఛాయలు
With the death of Krishnamraj, the village of Mogultoor was saddened. టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతితో పశ్చిమగోదావరిలోని మొగల్తూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
By అంజి Published on 11 Sep 2022 1:06 PM GMTటాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతితో పశ్చిమగోదావరిలోని మొగల్తూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నటుడు, రాజకీయవేత్త అయినా కృష్ణంరాజు 1940 జనవరి 20న మొగల్తూరులో జన్మించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మరణంతో గ్రామస్తులు భావోద్వేగానికి లోనై ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణంరాజు చదివిన పాఠశాలను గ్రామస్తులు చూపించారు. కృష్ణంరాజు ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, అందరినీ మనస్ఫూర్తిగా తన ఇంటికి చేర్చుకునేవారని గ్రామస్థుడు ఒకరు తెలిపారు.
ఆయన మృతి తమ గ్రామానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు గ్రామస్తులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు నటుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు 83 ఏళ్లు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 187 సినిమాల్లో నటించారు.
1966లో 'చిలకా గోరింక' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి కృష్ణంరాజు పెద్దనాన్న. కృష్ణంరాజు తన నటనా కౌశలంతో కోట్లాది మంది హృదయాలను సంపాదించుకున్నారు. టాలీవుడ్ నటుడు కృష్ణంరాజు కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సానుభూతి తెలిపారు. సినీనటుడు కృష్ణంరాజు మృతి టాలీవుడ్‌కు తీరని లోటు అని, కేంద్ర మంత్రిగా, లోక్‌సభ సభ్యునిగా కూడా ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తన ఆత్మీయ మిత్రుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.