Chandrababu : ఎన్నిక‌ల్లో గెలిచాడ‌ని.. అక్క‌సుతో అర్థ‌రాత్రి అరెస్ట్ చేయిస్తావా : చంద్రబాబు

ప‌శ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి అయిన రామ‌గోపాల్‌రెడ్డిని శ‌నివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2023 5:21 AM GMT
Chandrababu, MLC Elections

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ప‌శ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి అయిన రామ‌గోపాల్‌రెడ్డిని శ‌నివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు.‘‘ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ..ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా?.. పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడని అక్కసుతో అర్థరాత్రి అరెస్టు చేస్తావా?..ఇంతకంటే నువ్వు ఇంకేం బ్రష్టు పట్టించాల్సివుంది. ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరు! అంటూ చంద్ర‌బాబు ట్వీట్ చేశాడు. డిక్లరేషన్ అడిగిన రామగోపాల్ రెడ్డిని రాత్రి కౌంటింగ్ సెంటర్ వద్ద అరెస్ట్ చేసిన‌ వీడియో‎ను దీనికి జ‌త చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ‌గోపాల్ రెడ్డి గెలుపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రామ‌గోపాల్ రెడ్డి గెలుపుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు శ‌నివారం అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. దీనిపై ఆగ్ర‌హించిన టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి ప‌రిటాల సునీత‌, మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి త‌దిత‌రులు జేఎన్‌టీయూ గేటు ఎదుట బైఠాయించి నిర‌స‌నకు దిగారు.

సంయుక్త క‌లెక్ట‌ర్ కేత‌న్‌గార్డ్ కారును అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డ స్వ‌ల్ప ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి టీడీపీ అభ్య‌ర్థి భూమిరెడ్డి రామ‌గోపాల్‌రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి ప‌రిటాల సునీత‌, మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి త‌దిత‌రుల‌ను అరెస్ట్ చేసి మూడో ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

Next Story