టీడీపీ అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గిస్తాం: నారా లోకేష్

Will bring down prices after TDP comes to power in 2024.. Nara Lokesh. చిత్తూరు: 2024లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలను

By అంజి  Published on  29 Jan 2023 3:54 PM IST
టీడీపీ అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గిస్తాం: నారా లోకేష్

చిత్తూరు: 2024లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆదివారం నాడు కుప్పం శాంతిపురంలో మూడో రోజు యువ గళం పాదయాత్రను లోకేష్‌ ప్రారంభించారు. బాలాజీ కళ్యాణ మండపం వద్ద పాదయాత్రకు హాజరైన మహిళలను ఉద్దేశించి నారా లోకేష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఆరోపించారు. జగన్‌ పాలనలో మహిళలకు భద్రతా, భరోసా లేదని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం 90 శాతం మందికి అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంతో మహిళల భద్రతకు ఎలాంటి ఉపయోగం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడంలో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికే బాగా స్థిరపడిన కంపెనీలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిందని టీడీపీ ఎమ్మెల్సీ అన్నారు. మద్యపాన నిషేదం అమలు చేసిన తర్వాతే ఓట్లు అడగడానికి వస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

కరెంట్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా అన్ని పెంచుకుంటూ పోతున్నారన్నారు. మహిళలకు సాధికారత తీసుకొచ్చిన పార్టీ టీడీపీ అని పేర్కొంటూ.. మహిళల భద్రత, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. పన్నుల భారం తగ్గించేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు.

Next Story