Andhrapradesh: 'సూపర్ సిక్స్ ఏమైంది'.. ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్
సూపర్ సిక్స్ ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అందులో ప్రకటించిన పథకాలు ఏమయ్యాయి అని నిలదీశారు.
By అంజి Published on 26 July 2024 10:00 AM GMTAndhrapradesh: 'సూపర్ సిక్స్ ఏమైంది'.. ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధ్యం కాని ఎన్నికల వాగ్దానాలు ఇచ్చి, ఇప్పుడు సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా వెనుకడుగు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఆరోపించారు. 12 నెలల బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు.
సాధారణ బడ్జెట్‌ను సమర్పిస్తే, ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన బూటకపు వాగ్దానాలను సాధారణ బడ్జెట్‌లో చూపించాల్సి ఉంటుందని, ఆ సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయకపోతే, ప్రజలు గళం విప్పుతారని చంద్రబాబు భావిస్తున్నట్టుందని తాడేపల్లిలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో వైఎస్ జగన్ అన్నారు. సూపర్ సిక్స్ ఏమైందని ప్రశ్నించారు. అందులో ప్రకటించిన పథకాలు ఏమయ్యాయి అని నిలదీశారు.
సూపర్ సిక్స్ పథకంలో 19 నుండి 59 సంవత్సరాల వయస్సు గల మహిళలకు రూ. 1,500 నెలవారీ పెన్షన్, యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా రూ. 3,000 నెలవారీ నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఉన్నాయి. సూపర్ సిక్స్ కింద ఉన్న ఇతర పథకాలలో ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, పాఠశాలకు వెళ్లే ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ. 15,000, ప్రతి రైతుకు రూ. 20,000 వార్షిక ఆర్థిక సహాయం ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రజలు రోడ్లపైకి రాకుండా కూటమి ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన డబ్బు అందుతుందా లేదా అని ప్రజలు వేచి చూస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. 'ఆర్థిక అవరోధాల' కారణంగా రెండు నెలల తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ఇటీవల ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన 52 రోజుల తర్వాత రాష్ట్రం ముందుకు సాగుతోందా లేక వెనక్కు వెళుతోందా అని ప్రశ్నిస్తూ హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం వంటి దారుణాలు జరిగాయని ఆరోపించారు. బిజెపి, జనసేనలు కూడా ఉన్న టిడిపి నేతృత్వంలోని ప్రభుత్వం అణిచివేత పాలనలో పోలీసు శాఖ ప్రేక్షకపాత్ర పోషిస్తుండగా, బాధితులపై కేసులు నమోదు అవుతున్నాయని ప్రతిపక్ష నేత అన్నారు.