ఏపీలో అతి భారీ వర్షాలు పడే అవకాశం.. ఈ జిల్లాల్లో హై అలర్ట్!
ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి
By Medi Samrat Published on 13 Oct 2024 6:29 PM ISTఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి మరింత విస్తరించడంతో అక్టోబరు 14న దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ విషయాన్ని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) స్పష్టం చేసింది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ఏపీ దక్షిణ కోస్తా తీరం వైపు పయనించే అవకాశాలు ఉండడంతో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14, 15, 16, 17 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ఆనంద్ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 0861-2331261, 7995576699, 1077 నెంబర్ల ద్వారా కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. తీరప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు చేస్తున్నారు అధికారులు.
Next Story