అమరావతి: జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ పథకం అమలుకు రూ.76 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను కోరామన్నారు. పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్టు వివరించారు. విజయవాడలో జల్‌జీవన్ మిషన్ అమలుపై వర్క్‌షాప్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ పథకానికి అన్ని రాష్ట్రాలు లక్ష కోట్ల రూపాయలు అడిగితే, వైసీపీ ప్రభుత్వం రూ.26 కోట్లే అడిగిందని ఆరోపించారు. ఈ పథకం ద్వారా రోజుకు ప్రతి వ్యక్తికి 55 లీటర్ల నీళ్లు ఇచ్చి, ప్రధాని మోదీ కలను సాకారం చేస్తామన్నారు.
నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతోనే జల్ జీవన్ మిషన్ ప్రారంభమైందని పవన్ కల్యాణ్ అన్నారు. ఉన్న నీటి వనరులు బలోపేతం చేయడం, నిర్వహణ చాలా ముఖ్యమన్నారు. ఈ పథకంలో ఉద్యోగులే కాకుండా ప్రజలను కూడా భాగస్వాములు చేయాలనేది తమ ఆలోచనని తెలిపారు. నీటి సరఫరాలో తరచూ వచ్చే ఇబ్బందుల పరిష్కారానికి అమృతధార కింద విధి విధానాల రూపకల్పన చేస్తామన్నారు. ఒక గంట నీళ్లు తాగకపోతే ఎంత కష్టమో అందరికీ తెలుసునని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. జల్ జీవన్ మిషన్‌లో గత ప్రభుత్వం రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేసిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటామనేది గుర్తించకముందే పైపులు వేశారన్నారు.