అమరావతి: 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తమ హామీని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటుచేసిన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం సోమవారం ఉండవల్లి నివాసంలో జరిగింది. ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ.8,73,220 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 5,27,824 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు మంత్రి లోకేష్‌కు వివరించారు.
ఇన్వెస్ట్ మెంట్ ట్రాకర్ పోర్టల్ ను సమర్థంగా తీర్చిదిద్దాలని.. భూకేటాయింపులు, అనుమతులకు సంబంధించిన అన్ని వివరాలు ట్రాకర్ లో పొందుపర్చాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ప్రతిబంధకంగా మారిన విధానాలను సంస్కరిస్తామని తెలిపారు. ఎంఎస్ఎమ్ఈలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పారు. దేశంలో ఉన్న అన్ని పెద్ద కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు మరింత విస్తరించేలా వారిలో నమ్మకం కల్పించాలని తెలియజేశారు.