99 శాతం హామీలను నెరవేర్చాం.. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా?: సీఎం జగన్
వైసీపీకి ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాని, చంద్రబాబుకు ఓటేస్తే ఆగిపోతాయని సీఎం వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు.
By అంజి Published on 6 May 2024 1:30 PM IST99 శాతం హామీలను నెరవేర్చాం.. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా?: సీఎం జగన్
వైసీపీకి ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాని, చంద్రబాబుకు ఓటేస్తే ఆగిపోతాయని సీఎం వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చామన్నారు. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో వేశామని, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టామని చెప్పారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా సాయం అందించామన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ తెలిపారు. 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులెన్నో తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు.
చంద్రబాబును నమ్మడం అంటే.. కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమేనన్నారు. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యమని, సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు ఇదే అర్థమని, ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోండని అన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2లక్షల 70 వేల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం ద్వారా నేరుగా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అయ్యాయని తెలిపారు. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.. నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు వెళ్లిపోయాయన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం తమది అని సీఎం జగన్ అన్నారు.
గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. అయితే చంద్రబాబు సూపర్ సిక్స్ అంటున్నారని, మీరు (ప్రజలు) నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? ఆలోచన చేయాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. మళ్లీ ఫ్యాన్ గుర్తుకే ఓటెయ్యాల్నారు. బటన్లు నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు.. సిద్ధమేనా? అని సీఎం జగన్ ప్రజలను ప్రశ్నించారు.