ఏపీని అలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం: హోంమంత్రి అనిత

మత్తు పదార్ధాల గుర్తింపులో శిక్షణ పొందిన స్లీఫర్ డాగ్స్ పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు.

By Knakam Karthik
Published on : 2 Sept 2025 5:30 PM IST

Andrapradesh, Guntur District, Home Minister Anitha, AP Police, Passing Out Parade

ఏపీని అలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం: హోంమంత్రి అనిత

అమరావతి: మత్తు పదార్ధాల గుర్తింపులో శిక్షణ పొందిన స్లీఫర్ డాగ్స్ పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. ప్రజల రక్షణలో కీలకంగా వ్యవహరించే పోలీసు శాఖ మరింత చురుకుగా పని చేస్తోందని తెలిపారు. యువత మత్తుపదార్థాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

మంగళవారం గుంటూరు జిల్లాలోని ఆరో బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఐపీఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు హోంమంత్రి అనిత, 31వ పోలీసు జాగిలాల ప్రదర్శన, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతి అందజేశారు. ప్రథమ స్థానం నెల్లూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం దక్కించుకున్నారు. రెండో స్థానంలో పల్నాడు అశోక్, గుంటూరు జిల్లాకు చెందిన వేణుబాబు సాధించారు. తృతీయ స్థానంలో రాజమండ్రికి చెందిన శివకుమార్ దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ..జాగిలాల ప్రదర్శన, వాటి క్రమ శిక్షణ చూస్తే ఆశ్చర్యం కలిగిందని పేర్కొన్నారు. మూగ జీవాలతో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ జాగిలాల వల్ల ఎన్నో కేసులు ఛేదించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఎక్కడ నేరం జరిగినా... డాగ్ స్క్వాడ్ రాలేదా అని ప్రజలే అడుగుతారని అన్నారు. ప్రతి జాగిలానికి రెండు అంశాల్లో శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారని చెప్పుకొచ్చారు.మందుగుండు, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం ఏదైనా ఎక్కడ దాచినా గుర్తించేలా జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని తెలిపారు హోంమంత్రి అనిత. నేటికీ అప్పా అనేది మనం కేటాయించుకోలేక పోయామని హోంమంత్రి అనిత వెల్లడించారు. వంద ఎకరాల్లో అప్పా నిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. కొత్తగా వచ్చే పోలీసు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం పైన కూడా శిక్షణ ఇస్తున్నారని వివరించారు. నేర పరిశోధనలో, ప్రజల శ్రేయస్సులో కూడా పోలీసు జాగిలాలది కీలకపాత్రని ఉద్ఘాటించారు. గతంలో రేపల్లెలో అత్యాచారం జరిగిన కేసులో ఎలాంటి ఆధారం దొరకలేదని చెప్పుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ వచ్చి ఆనవాళ్లు గుర్తించాక 36 గంటల్లో నిందితులను పట్టుకున్నారని గుర్తుచేశారు. పోలీసు జాగిలాల శిక్షణతో‌పాటు, వాటి సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు.

Next Story