ఏపీలో ఓట్ల పంచాయితీ.. ఎన్నికల సంఘాన్ని కలిసిన ఎంపీలు
ఏపీలో ఓట్ల పంచాయితీపై టీడీపీ పార్లమెంటేరియన్ల బృందం గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ను కలిసి లేఖను సమర్పించింది.
By అంజి Published on 15 Dec 2023 7:00 AM IST
ఏపీలో ఓట్ల పంచాయితీ.. ఎన్నికల సంఘాన్ని కలిసిన ఎంపీలు
టీడీపీ పార్లమెంటేరియన్ల బృందం గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ను కలిసి, 2024లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలను తప్పులు లేకుండా చూడటానికి ఆంధ్రప్రదేశ్ వెలుపల ఉన్న సీనియర్ ఆల్ ఇండియా సర్వీస్ (AIS) అధికారులను వెంటనే డిప్యూట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. టీడీపీ ఎంపీలు జయదేవ్ గల్లా, కే రవీంద్రకుమార్, కే రామ్మోహన్ నాయుడు, కే శ్రీనివాస్ కుమార్‌ను కలిసి జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవో), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌ఓ) ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించలేకపోతున్నారని ఆరోపిస్తూ లేఖ సమర్పించారు. ఎన్నికల అధికారులు.. వైసీపీ నాయకుల నుండి ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు.
“పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటిని క్షుణ్ణంగా, నిష్పక్షపాతంగా ప్రాసెస్ చేసేలా చూడడానికి ఏపీ వెలుపలి నుండి సీనియర్ ఏఐఎస్ అధికారులను వెంటనే పరిశీలకులుగా నియమించాలని ఈసీఐకి మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము” అని ఎంపీలు ఎన్నికల జాబితాపై సీఈసీకి రాసిన లేఖలో తెలిపారు. అక్టోబరు 27న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలించి, మూల్యాంకనం చేసేలా ఆ అధికారులను ఆదేశించాలని సీఈసీని అభ్యర్థించారు.
ఇదిలా ఉంటే.. విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓట్లను చేర్చుతోందంటూ సీఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు 40,76,580 దొంగ ఓట్లను చేర్పించారంటూ తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి అవకతవకలకు పాల్పడ్డారని వివరించారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లను ఏపీలో నమోదు చేయించారని వైసీపీ ఎంపీలు ఆరోపణలు చేశారు.